పాతకాలంలో ప్రతి ఇంట్లో ఈ పచ్చడి ఉండేది.. రుచి మాత్రం అద్భుతంగా ఉండేది, ఎలా చేసుకోవాలంటే?

పాతకాలంలో మన వాళ్ళు ఎక్కువగా రోటి పచ్చడి చేసుకుని తినేవారు. ఆ రోటి పచ్చడి వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరిగేవి. అలాగే చాలా రుచికరంగా కూడా ఉండేవి. అందులోని అణువణువూ మనలో కొత్త రుచి రాజుని నిద్రలేపేవి. అలాంటి రోటి పచ్చడిలో ఒకటే మినపప్పు రోటి పచ్చడి. ఇవి చాలా అంటే చాలా రుచికరంగా ఉండేది. ఇందులోని అన్ని పదార్థాలను కలిపి.. వేయించుకొని రోటిలో దంచుకొని తింటే అబ్బా అనాల్సిందే. పూర్వకాలంలో చాలా మంది ఇదే చేసుకొని తినేవారు. కానీ ఇప్పుడు వారి సంఖ్య తగ్గిపోయింది. అందుకే ఈ స్టోరీలో ఈ మినపప్పు రోటి పచ్చడి ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది వివరించాము. పూర్తిగా ఈ స్టోరీని చదివి మీరు కూడా ఈ రోటి పచ్చడిని చేసుకొని తిని చూడండి.

మినపప్పు రోటి పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు

150 గ్రాముల మినపప్పు
20 ఎండు మిరపకాయలు
ఒక చెంచా జీలకర్ర
రెండు చెంచాల ధనియాలు
చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు
ఒక చిన్న మండ కరివేపాకు
ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ
పది ఒలిచిన వెల్లుల్లి రెబ్బలు
రెండు చెంచాల నూనె
రుచికి సరిపడా ఉప్పు

మినపప్పు రోటి పచ్చడి తయారీ విధానం

ఈ మినపప్పు రోటి పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగానే చింతపండును నానబెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయను కట్ చేసుకోవాలి. అనంతరం ఒక కడాయి తీసుకోవాలి. అందులో రెండు చెంచాల నూనె వేసుకోవాలి. ఆ నూనెలో ముందుగా తీసుకున్న 20 ఎండు మిరపకాయలను వేయించుకొని ఒక ప్లేట్‌లో తీసుకోవాలి.

అచ్చమైన ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ పులుసు.. ఒకటే ముద్ద తినండి,మైమరచిపోవాల్సిందే.. ఎలా చేసుకోవాలంటే?

ఇప్పుడు అదే నూనెలో 150 గ్రాముల మినపప్పు వేసుకొని, వేయించుకోవాలి. మినపప్పు కొంచెం రంగు మారిన తరువాత.. అందులో రెండు చెంచాల ధనియాలు కూడా వేసుకొని ఒక 30 సెకండ్ల పాటు వేయించుకోవాలి. అనంతరం ఒక చెంచా జీలకర్ర కూడా వేసుకొని.. మరో 30 సెకండ్ల పాటు వేయించుకోవాలి.

ఇప్పుడు ఒక చిన్న మండ కరివేపాకును కూడా వేసుకొని, అవి చిటపటాలాడుతుండగా.. అందులోని ధనియాలు, జీలకర్ర అంతా బాగా ఫ్రై అయిన తరువాత మొత్తాన్ని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు కాసేపు చల్లారిన తరువాత.. రోలు ఉన్న వారు రోలు దగ్గరికి.. మిక్సీలో వేసుకోవాలని అనుకునే వ్యక్తులు మిక్సీ దగ్గరికి వెళ్ళిపోవాలి.

ఇప్పుడు మనం వేయించిపెట్టుకున్న మిర్చిని ముందుగా రోలులో వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఆ తరువాత అందులో మినపప్పు మిశ్రమాన్ని వేసుకొని రుబ్బుకోవాలి. మినపప్పు రుబ్బుకునేటప్పుడు కొంచెం కొంచెం పోసుకుంటూ రుబ్బుకోవాలి. మినపప్పు బాగా రుబ్బిన తరువాత.. అందులో చింతపండు రసం, అలాగే ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. అయితే ఒక్కసారి ఉప్పు కూడా వేసుకొని, రుచి చూసుకొని ఓసారి రుబ్బి, పక్కన పెట్టుకుంటే ఎంతో రుచికరమైన మినపప్పు రోటి పచ్చడి సిద్ధమైనట్లే. దీంట్లో కొంచెం నెయ్యి తగిలించి అన్నం తింటే.. ఉంటుంది అబ్బా అనాల్సిందే.

[ of 5 - Users]
Story first published: Sunday, April 27, 2025, 11:20 [IST]
Desktop Bottom Promotion